Wednesday, March 24, 2010

శ్రీమతికి ప్రేమలేఖ

తొలిసారి నిన్ను పెళ్ళిచూపుల్లో చూసిన నాడే నీ కళ్ళలో తొణికిసలాడిన ప్రేమ, ఆప్యాయతకి బంధీనయ్యాను. తొలిరేయి పాలరాతి శిల్పంలా గదిలోకొచ్చిన నిన్ను చూసి అందానికి ముద్దు పేరు నువ్వా అనిపించింది. ఎరుపెక్కిన నీ చెక్కిళ్ళ కాంతి తనపై పడగానే మెరిసిపోతున్న చంద్రున్ని చూసి, అంతలోనే తెల్లవారిందా అని భ్రమపడ్డాను. కాలికి పారాణి పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే, నీ కాలికున్న మువ్వల సవ్వడికి నా మనసు ఎంతో పారవశ్యం చెందేది. పెళ్లైన తొలిరోజుల్లో ఆఫీసు నుండి రాగానే చిరునవ్వుతో ఆహ్వానమిచ్చి, చేతికి కాఫీ కప్పు అందించేదానివి. సాయం సంధ్యాసమయంలో, మల్లెపందిరి నీడలో నీ ఒడిలో తల పెట్టుకొని ఉంటే, నీ చేతి వేళ్ళతో నా తల నిమురుతూ, కబుర్లు చెపుతుంటే రోజంతా పడిన కష్టాన్ని మర్చిపోయి, హాయిగా సేదతీరేవాడిని.
కానీ ఏవీ ఆనాటి ఆ ఒరకంటి చూపులు, నునులేత సిగ్గులు, కొంటె నవ్వులు, చిలిపి చేష్టలు. ఏదీ ఆ ప్రేమ ఇప్పుడు నీ కళ్ళలో ఎంత వెతికిన కనిపించదే. అలనాటి ఆ చల్లని రేయి ఇప్పుడు ఒక్కటి కూడా రావటం లేదే. మాటలాడటానికి మన మధ్య మాటలే కరువయ్యాయే. ప్రతి క్షణం గొడవలు, ఏడుపులు, సాధింపులు. అయినా కూడా ఏనాడు నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదే. ప్రతీ నిమిషం నా మొహంలో ఆనందంకై తపించేదానివే, ఇప్పుడేమై పోయింది ఆ తపన. ఎప్పుడూ డబ్బు డబ్బు అంటావ్. ఎంత తెచ్చినా చాలదంటావ్. పట్టు చీరంటావ్. పట్టె మంచమంటావ్. పంచభక్ష పరమాన్నాలు లేనిదే ముద్ద నోట పెట్టనంటావ్. ఎంత చేసినా ఇంకా ఇంకా కావాలంటావ్. నువ్వేమో సొంతిల్లు అంటావ్. నేనేమో నీకోసం నా హృదయంలో బంగారు తాజ్ మహల్ నే నిర్మించాను, అది నీకు కనపడదు. తిరగడానికి కారు కావాలంటావ్. కానీ మనిద్దరం కలిసి ఊహాలోకంలో విశ్వాన్నంత చుట్టి వచ్చిన రోజుల్ని మర్చిపోయావ్. నగలంటావ్. నౌకర్ కావాలంటావ్. నేనేమో నీ పెదవులపై చిరునవ్వు చాలనుకుంటాను. మనిషికి బ్రతకటానికి డబ్బు అవసరమే కావచ్చు కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. మధ్యతరగతి జీవితాలంతే. చాలీ చాలని జీతంతో నీ గొంతెమ్మ కోర్కెలను నే తీర్చలేను, కానీ ఇప్పటికీ నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. నీ సాంగత్యంలో నాకో కొత్త లోకాన్ని చూపించావు. ఇప్పుడు అదే లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావే నీకిది న్యాయమా...! పక్కనే వున్నా రోజురోజుకి దూరమై పోతున్నావు. నువ్వెంత చేసినా ఆ బాధనంత మనసులోనే సమాధి చేసి పైకి నవ్వుతూ నీ ముందున్నాను. నువ్వు మాత్రం ఇన్నాళ్ళ మన సంసార జీవితంలో నా మనసుని, దాని మూగ వేదనను, అది కార్చే కన్నీళ్ళను అర్ధం చేసుకోలేకపోయావు. ఇంకా కొన్ని రోజులు ఇలానే పోతే నువ్వు నాకు శాశ్వతంగా దూరమై పోతావేమోననే భయంతో ఈ నా మొదటి మరియు చివరి ప్రేమ లేఖ వ్రాస్తున్నాను.
నీతో కలిసి వెన్నెల కాంతిని, మల్లెల పరిమళాన్ని మనసారా ఆస్వాదించే రోజు మళ్ళీ వస్తుందా....!
నీ
నీలోని సగం.

---Swaraanjan

No comments:

Post a Comment