Tuesday, March 30, 2010

ఇది ఏమి మాయో..!

ఉదయాన చంద్రుడు
వెచ్చగా వికసించాడు.
సెలయేటిలో నక్షత్రాలు
జలకాలాడుతున్నాయి.

చెట్టు మీది కాకిపిల్ల
అందంగా పాడుతోంది.
చిరుగాలి తన మావ
జామతో ఊసులాడుతోంది.

ఇంటి ముందు కోడిపుంజు
పురివిప్పి నాట్యం చేస్తోంది.
తోటలోని సన్నజాజులు
మంటలు విరజిమ్ముతున్నాయి.

ఆకాశంలో మల్లెమొగ్గలు
అందంగా మెరుస్తున్నాయి.
మల్లెల మధ్య కొంటె సూరీడు
నన్ను చూసి నవ్వుతున్నాడు.

--Swaraanjan

Sunday, March 28, 2010

నాకు తెలియని నేను-1

Disclaimer:
ఇది కథ కాదు, కల్పన అంతకన్నా కాదు, యదార్థం. కానీ ఇందులోని పాత్రల పేర్లన్నీ మార్చబడినవి. ఏదేని సారూప్యత కేవలం యాదృచ్ఛికం. అయినప్పటికినీ ఇందులో ఉన్నది మీరే అని అనిపించినట్లయితే మీ పాత్ర నామం, నిజ నామం తో నన్ను email లో  సంప్రదించండి. మీ పాత స్నేహితులు మీకోసం వేచియున్నారు.

ఈ కథను, కథానాయకుడు మనకు తన జీవితం గురించి చెప్తున్నట్లుగా వ్రాయటం జరిగింది.

*********************************************************************************************************




నేను మంచివాడినా?  కాదేమో,  కానీ చెడ్డవాడిని మాత్రం కాదు(అనుకుంటాను).   ఏమో,  చెడ్డవాడినే కావచ్చు లేదా చిలిపి వాడిని కావచ్చు.   ఇప్పటి వరకు ఎవరినీ మోసం,  అన్యాయం చెయ్యలేదు.   అన్యాయం చేసే అవకాశం రాలేదేమో?  ఒకవేళ ఆ అవకాశమే వచ్చుంటే?

ఒక మంచివాడిని,  మంచివాడు అని ఎలా చెప్పగలం?  చెడు చేసే అవకాశం రాక,  అవసరం లేక చేయలేదేమో? అంత మాత్రాన వారు మంచివారు అవరు కదా!  అవకాశం వచ్చినా,  అవసరం ఉన్నా, ఎవరికీ చెడు తలపెట్టకుంటేనే కదా మంచివారు అనేది.

అందుకే నేను మంచివాడిని కాదేమో?  ఒకసారి అవకాశం వచ్చినా తోసిపుచ్చాను,  అంటే నేను మంచివాడిననేగా?  కాదేమో?  కేవలం భయం వల్లే వదులుకుని ఉండవచ్చు కదా!  అలా అయితే నేను మంచివాడిని ఎలా అవుతాను?

అసలు మంచి అంటే ఏంటి?  ఏవి మంచి పనులు?  ఏవి చెడ్డవి?  ఏవి చిలిపివి?  చిలిపి పనులన్నీ చెడ్డవేనా? ఏ చిలిపి పని అయినా చెడ్డ పని అవుతుందా?  నాకు మంచి అనిపించింది,  నీకు చెడు కావచ్చు.   నీకు చెడు,  నాకు చిలిపి కావచ్చు.   ఏది మంచి,  ఏది చెడు,  ఎవరు నిర్ణయిస్తారు? నేనా?  నువ్వా?  మన నేతలా?  సమాజమా?

సమాజం:  మనకి చెడు అనిపించింది,  మన దాయాదులకు సాధారణం కావచ్చు.   మన మంచి వారికి బంధనాలుగా అనిపించొచ్చు.   స్వేచ్ఛ అనేది మంచికా?  చెడుకా?  అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి?  మనకు నచ్చినట్లు ఉండటమా?  లేక కట్టుబాట్ల పరిధిలోనే మనకు నచ్చింది చెయ్యటమా? కట్టుబాట్ల పరిధిలో అంటే అది అసలు స్వేచ్ఛ అవుతుందా?  ఏది స్వేచ్ఛ?  ఏది విచ్చలవిడి తనం? నేను స్వేచ్ఛా జీవినా?  కాదా?  స్వేచ్ఛకీ,  మంచికీ,  చెడుకీ ఉన్న సంబంధం ఏమిటి? 

అసలు నేను ఎలాంటి వాడిని? తెలుసుకునే నా జీవన పయనమే, నాకు తెలియని నేను.


                                                                                                       To Be Contd.........


--Swaraanjan

మిగిలిన భాగాల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Wednesday, March 24, 2010

లొల్లి

ప్రపంచంలో లొల్లి లేనిది ఎక్కడో చెప్పండి. అధికార పార్టీ ప్రతిపాదనలు లొల్లి, ప్రతిపక్ష పార్టీ వాదనలు లొల్లి. అసెంబ్లీలో బిల్లు పెడితే లొల్లి, పెట్టకుంటే లొల్లి. మాష్టారు చెప్పే పాఠం లొల్లి, విద్యార్థులు క్లాస్ లో వేసే కుప్పిగంతులు లొల్లి. స్కూల్ స్టార్ట్      అయితే లొల్లి, వదిలేస్తే లొల్లి. బొమ్మలు కావాలని పిల్లల లొల్లి, ఇంత పెద్దయ్యావు ఇంకా బొమ్మలా  అని పేరెంట్స్      లొల్లి. గర్ల్      ఫ్రెండ్  చెప్పింది కాదంటే లొల్లి. కొత్త చీర కావాలి అని భార్య చేసే లొల్లి, మొన్నే కదా వేలు తగలేసి  పట్టు చీర తీసుకున్నావ్  మళ్ళీ  చీరనా అని భర్త లొల్లి.జాబ్  వుంటే లొల్లి , లేకుంటే ఇంకో లొల్లి . వర్షం పడితే లొల్లి, పడకుంటే లొల్లి. పంటలు పండితే లొల్లి, పండకుంటే లొల్లి. పరీక్షలు లొల్లి, రిజల్ట్స్      మహా లొల్లి.పెద్దవారు చెప్పే మంచి మాటలు మనకు లొల్లి, మనం చేసే పనులు వారికి లొల్లి.
ఇలా లొల్లి గురించి చెప్పాలంటే లొల్లి  లొల్లి అవుతుంది. అందుకే లొల్లి గురించి లొల్లి పెట్టకుండా లొల్లిని లొల్లికే వదిలేసి ఏ మాత్రం లొల్లి లేకుండా  మీ కోసం ఈ లొల్లి టపా.

---Swaraanjan

ప్రాణం లేని హృదయం

వెన్నెల లేని నిశీధిలో నిన్ను వదిలి జీవిత గమనంలో నా గమ్యంకై సాగిపోతున్నా, నేను నా హృదయమును నీ చెంత వదిలి వెడుతున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ చెరిగిపోని తీపి గుర్తుగా, ఈ ఎడబాటు ఓ తీపి బాధగా నాతో నా జీవిత పయనంలో నాకు తోడుగ తీసుకెళ్తున్నా.. ఈ క్షణంలో నీ కనులలోకి సూటిగా చూసే ధైర్యంలేక నాలో నేనే విలపిస్తున్నాను.నిన్ను చూడలేని నా కనులకు అంధకార జ్వాలలు అలుముకుంటున్నాయి. నాలోని ప్రతి అంగం ఈ ఎడబాటును భరించలేక విలపిస్తున్నాయి.

కాలం చేసే తప్పుకు మనం ఇలా బలి కావలసిందేనా? నీ ధరికి చేరిన ఆ క్షణం అలానే నిలిచిపోయి వుంటే ఎంత బావుండో..! ఒకే ప్రాణమైన మనల్ని నువ్వు, నేను వేరు వేరు గూటి గువ్వలం అంటూ అమానుషంగా విడదీస్తున్న ఈ విధి ఆగడాలను ఆపే వాడే లేడా?? జగత్తులో అత్యంత గొప్పదైన ప్రేమ కూడ ఈ నరకపు కోతలను అనుభవించాలా?

ఆసలు నీవు నా జీవిత పుటలలోకి తియ్యని కావ్యంలా ఎందుకొచ్చావ్? ఎందుకు నన్ను నీ ప్రేమలో బంధించావ్? ఇప్పుడిలా ఎందుకు నా మనసుకు గాయం చేస్తున్నావ్? నీ స్నేహం, నీ కన్నుల భాష్యాలు, నీ తీయని పలుకులు మరలా నాకు దొరికేనా??

మన తీపి ఙ్నాపకాలనే నీకు కన్నీటిగా మిగిల్చి శూన్యం లోకి వెళ్తున్నాను. మరు జన్మకైనా ఒకే గూటి గువ్వలలా జీవితమంతా కలిసుండాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, నీకు నా కన్నీటి వీడ్కోలు.......

---Swaraanjan

నీవెవరు??

జడివానలో మల్లెపువ్వువా!
బృందావనిలో పారిజాతానివా!
కోనేటిలో ఎర్రకలువవా!
కాలువగట్టుపై పిల్లగాలివా!
ఉషోదయవేళ నీటిబొట్టువా!
సాయంకాలపు పశ్చిమానివా!
పండగనాటి రంగవళ్లివా!
చంటిపిల్లల కంటిపాపవా!
పల్లెనోటిలో జానపదానివా!
వసంతకాలపు నిండుపున్నమివా!
చిన్నిపెదవిపై చిరునవ్వువా!
కన్నెగుండెలో కొంటెతనానివా.......!

Dedicated to :: Sushmita  Sabbanwar(SS)
---Swaraanjan

శ్రీమతికి ప్రేమలేఖ

తొలిసారి నిన్ను పెళ్ళిచూపుల్లో చూసిన నాడే నీ కళ్ళలో తొణికిసలాడిన ప్రేమ, ఆప్యాయతకి బంధీనయ్యాను. తొలిరేయి పాలరాతి శిల్పంలా గదిలోకొచ్చిన నిన్ను చూసి అందానికి ముద్దు పేరు నువ్వా అనిపించింది. ఎరుపెక్కిన నీ చెక్కిళ్ళ కాంతి తనపై పడగానే మెరిసిపోతున్న చంద్రున్ని చూసి, అంతలోనే తెల్లవారిందా అని భ్రమపడ్డాను. కాలికి పారాణి పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే, నీ కాలికున్న మువ్వల సవ్వడికి నా మనసు ఎంతో పారవశ్యం చెందేది. పెళ్లైన తొలిరోజుల్లో ఆఫీసు నుండి రాగానే చిరునవ్వుతో ఆహ్వానమిచ్చి, చేతికి కాఫీ కప్పు అందించేదానివి. సాయం సంధ్యాసమయంలో, మల్లెపందిరి నీడలో నీ ఒడిలో తల పెట్టుకొని ఉంటే, నీ చేతి వేళ్ళతో నా తల నిమురుతూ, కబుర్లు చెపుతుంటే రోజంతా పడిన కష్టాన్ని మర్చిపోయి, హాయిగా సేదతీరేవాడిని.
కానీ ఏవీ ఆనాటి ఆ ఒరకంటి చూపులు, నునులేత సిగ్గులు, కొంటె నవ్వులు, చిలిపి చేష్టలు. ఏదీ ఆ ప్రేమ ఇప్పుడు నీ కళ్ళలో ఎంత వెతికిన కనిపించదే. అలనాటి ఆ చల్లని రేయి ఇప్పుడు ఒక్కటి కూడా రావటం లేదే. మాటలాడటానికి మన మధ్య మాటలే కరువయ్యాయే. ప్రతి క్షణం గొడవలు, ఏడుపులు, సాధింపులు. అయినా కూడా ఏనాడు నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదే. ప్రతీ నిమిషం నా మొహంలో ఆనందంకై తపించేదానివే, ఇప్పుడేమై పోయింది ఆ తపన. ఎప్పుడూ డబ్బు డబ్బు అంటావ్. ఎంత తెచ్చినా చాలదంటావ్. పట్టు చీరంటావ్. పట్టె మంచమంటావ్. పంచభక్ష పరమాన్నాలు లేనిదే ముద్ద నోట పెట్టనంటావ్. ఎంత చేసినా ఇంకా ఇంకా కావాలంటావ్. నువ్వేమో సొంతిల్లు అంటావ్. నేనేమో నీకోసం నా హృదయంలో బంగారు తాజ్ మహల్ నే నిర్మించాను, అది నీకు కనపడదు. తిరగడానికి కారు కావాలంటావ్. కానీ మనిద్దరం కలిసి ఊహాలోకంలో విశ్వాన్నంత చుట్టి వచ్చిన రోజుల్ని మర్చిపోయావ్. నగలంటావ్. నౌకర్ కావాలంటావ్. నేనేమో నీ పెదవులపై చిరునవ్వు చాలనుకుంటాను. మనిషికి బ్రతకటానికి డబ్బు అవసరమే కావచ్చు కానీ డబ్బే బ్రతుకు కాకూడదు. మధ్యతరగతి జీవితాలంతే. చాలీ చాలని జీతంతో నీ గొంతెమ్మ కోర్కెలను నే తీర్చలేను, కానీ ఇప్పటికీ నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. నీ సాంగత్యంలో నాకో కొత్త లోకాన్ని చూపించావు. ఇప్పుడు అదే లోకంలో నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావే నీకిది న్యాయమా...! పక్కనే వున్నా రోజురోజుకి దూరమై పోతున్నావు. నువ్వెంత చేసినా ఆ బాధనంత మనసులోనే సమాధి చేసి పైకి నవ్వుతూ నీ ముందున్నాను. నువ్వు మాత్రం ఇన్నాళ్ళ మన సంసార జీవితంలో నా మనసుని, దాని మూగ వేదనను, అది కార్చే కన్నీళ్ళను అర్ధం చేసుకోలేకపోయావు. ఇంకా కొన్ని రోజులు ఇలానే పోతే నువ్వు నాకు శాశ్వతంగా దూరమై పోతావేమోననే భయంతో ఈ నా మొదటి మరియు చివరి ప్రేమ లేఖ వ్రాస్తున్నాను.
నీతో కలిసి వెన్నెల కాంతిని, మల్లెల పరిమళాన్ని మనసారా ఆస్వాదించే రోజు మళ్ళీ వస్తుందా....!
నీ
నీలోని సగం.

---Swaraanjan

ఏమో అవునేమో లేకుంటే ప్రకృతిలో ఇన్ని అందాలు ఉండేవి కాదేమో....!!

నీ నయనాలను చూసే ఆ బ్రహ్మ కలువను సృష్టించాడా!
నీ అధరాలను చూసే సంధ్యాకాల పశ్చిమం ఎరుపును పులుముకుందా!
నీ చిరుదరహాసం చూసే ముద్దబంతి సిగ్గుపడటం నేర్చుకుందా!
నీ చెక్కిలి చూసే చామంతి పువ్వు అవతరించిందా!
నీ గాత్రం వినే కోయిల ఆలపించటం మొదలెట్టిందా!
నీ సొగసును చూసే హిమగిరి సోయగాన్ని అలవర్చుకుందా!
నీ నడుము ఒంపులను చూసే నయాగారం అన్ని హొయలు పోతోందా!
నీ శిరోజాలను చూసే నిశీధి కాటుక పెట్టుకుందా!
నీ మువ్వల సవ్వడి వినే సెలయేరు గలగల పారుతోందా!
నీ ముఖకవళికలు చూసే ఇంద్రధనసు రంగులను సంతరించుకుందా!
నీ మేని పరిమళమే చిరుగాలికి జీవం తెచ్చిపెట్టిందా!
నీ హృదయగానాల నుండే ప్రేమ అనే పదం పుట్టిందా!
ఏమో అవునేమో లేకుంటే ప్రకృతిలో ఇన్ని అందాలు ఉండేవి కాదేమో....!!

---Swaraanjan

ప్రియా.... నీకై నిరీక్షణ

నింగి లోని నక్షత్రకన్యలు జాబిలి చెక్కిలిని ముద్దాడే వేళ, మల్లెమొగ్గలు వయ్యారంగా ఒళ్ళు విరుస్తూ విచ్చుకునే తరుణంలో, తమకంతో నీ ఆలింగనంకై పరితపించే నా హృదయం, తన హృదయ భాష్యాలను నీకు చేరవేయమని, నీకై, నీ స్పర్శకై, నీఓరకంటి చూపుకై , వేయి జన్మల నుంచి వేచియుండి , నాలోని అమృతమును నీకు అందిస్తూ , నీ ఒడిలో హిమంలాకరిగిపోతూ, స్వర్గపుటంచులను నీతో కలిసి అందుకోవాలని ఆకాంక్షించే నా మదికి రసరమ్య అనుభూతులను పంచమని, నీకునా హృదయ గానంగ విన్నవించమని, ఈ చిరుగాలితో నా హృదయ సవ్వడులనే అక్షరాలుగా మార్చి నీ దరికి పంపుతూ నీ రాకకై, నీ కలయికకై వేయి కోట్ల నయనాలతో ఎదురుచూస్తూ నీ........


----Swaraanjan

Welcome

నా కవితలన్ని ఒకే చోట  ఉండాలని ఈ కొత్త blog ను start చేస్తున్నాను. నా పాత blog లో ఇకపై సమాజం లో జరిగే వివిధ విషయాల పై నా అభిప్రాయాలు వుంటాయి.