Wednesday, March 24, 2010

ఏమో అవునేమో లేకుంటే ప్రకృతిలో ఇన్ని అందాలు ఉండేవి కాదేమో....!!

నీ నయనాలను చూసే ఆ బ్రహ్మ కలువను సృష్టించాడా!
నీ అధరాలను చూసే సంధ్యాకాల పశ్చిమం ఎరుపును పులుముకుందా!
నీ చిరుదరహాసం చూసే ముద్దబంతి సిగ్గుపడటం నేర్చుకుందా!
నీ చెక్కిలి చూసే చామంతి పువ్వు అవతరించిందా!
నీ గాత్రం వినే కోయిల ఆలపించటం మొదలెట్టిందా!
నీ సొగసును చూసే హిమగిరి సోయగాన్ని అలవర్చుకుందా!
నీ నడుము ఒంపులను చూసే నయాగారం అన్ని హొయలు పోతోందా!
నీ శిరోజాలను చూసే నిశీధి కాటుక పెట్టుకుందా!
నీ మువ్వల సవ్వడి వినే సెలయేరు గలగల పారుతోందా!
నీ ముఖకవళికలు చూసే ఇంద్రధనసు రంగులను సంతరించుకుందా!
నీ మేని పరిమళమే చిరుగాలికి జీవం తెచ్చిపెట్టిందా!
నీ హృదయగానాల నుండే ప్రేమ అనే పదం పుట్టిందా!
ఏమో అవునేమో లేకుంటే ప్రకృతిలో ఇన్ని అందాలు ఉండేవి కాదేమో....!!

---Swaraanjan

ప్రియా.... నీకై నిరీక్షణ

నింగి లోని నక్షత్రకన్యలు జాబిలి చెక్కిలిని ముద్దాడే వేళ, మల్లెమొగ్గలు వయ్యారంగా ఒళ్ళు విరుస్తూ విచ్చుకునే తరుణంలో, తమకంతో నీ ఆలింగనంకై పరితపించే నా హృదయం, తన హృదయ భాష్యాలను నీకు చేరవేయమని, నీకై, నీ స్పర్శకై, నీఓరకంటి చూపుకై , వేయి జన్మల నుంచి వేచియుండి , నాలోని అమృతమును నీకు అందిస్తూ , నీ ఒడిలో హిమంలాకరిగిపోతూ, స్వర్గపుటంచులను నీతో కలిసి అందుకోవాలని ఆకాంక్షించే నా మదికి రసరమ్య అనుభూతులను పంచమని, నీకునా హృదయ గానంగ విన్నవించమని, ఈ చిరుగాలితో నా హృదయ సవ్వడులనే అక్షరాలుగా మార్చి నీ దరికి పంపుతూ నీ రాకకై, నీ కలయికకై వేయి కోట్ల నయనాలతో ఎదురుచూస్తూ నీ........


----Swaraanjan

Welcome

నా కవితలన్ని ఒకే చోట  ఉండాలని ఈ కొత్త blog ను start చేస్తున్నాను. నా పాత blog లో ఇకపై సమాజం లో జరిగే వివిధ విషయాల పై నా అభిప్రాయాలు వుంటాయి.